న్యూఢిల్లీ, డిసెంబర్ 30: చిన్న మొత్తాలపై వడ్డీరేటును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 20 బేసిస్ పాయింట్ల నుంచి 110 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో చిన్న మొత్తాలపై వడ్డీరేటు 4 శాతం నుంచి 7.6 శాతం మధ్యలోకి చేరుకోనున్నాయి. ఈ పెంపు జనవరి-మార్చి త్రైమాసికానికిగాను వర్తించనున్నదని పేర్కొంది.
వరుసగా తొమ్మిది త్రైమాసికాలుగా చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను ముట్టుకొని నరేంద్ర మోదీ సర్కార్..అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికిగాను 30 బేసిస్ పాయింట్లు సవరించిన విషయం తెలిసిందే. చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను పెంచిన సర్కార్..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సుకణ్య సమృద్ధి స్కీంలపై వడ్డీరేటును మాత్రం యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి గత ఏప్రిల్ నుంచి రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను 225 బేసిస్ పాయింట్లు పెంచడంతో కేంద్రం తాజాగా చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను సవరించింది.