BIS for Ceiling Fans | విదేశాల నుంచి నాణ్యత లేని సీలింగ్ ఫ్యాన్ల దిగుమతికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశీయంగా వాటి తయారీని ప్రోత్సహించడానికి కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలు గల ఫ్యాన్లు మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై ఈ నెల తొమ్మిదో తేదీన డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. అంతే కాదు ఇక నుంచి బీఐఎస్ మార్క్ లేని ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్ల తయారీ, విక్రయం, దిగుమతి నిషేధం అని ఆ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఆరు నెలల నుంచి సీలింగ్ ఫ్యాన్లకు బీఐఎస్ ప్రమాణాలు అమల్లోకి వస్తాయని డీపీఐఐటీ తెలిపింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేండ్ల జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమాన విధిస్తారని తెలిపింది. రెండు, అంతకంటే ఎక్కువ సార్లు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.5 లక్షల జరిమాన, వస్తువుల విలువపై 10 రెట్లు పెనాల్టీ విధిస్తారు. అయితే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు మాత్రం 12 నెలల వరకూ గడువు ఇస్తున్నట్లు డీపీఐఐటీ తెలిపింది.