Online Payments | ఇప్పుడు ఏదైనా బిల్లు పే చేయాలంటే.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్స్ ద్వారా క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. అలాగే కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఆన్లైన్ లావాదేవీల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. వాటిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలు, మార్గదర్శకాలు తెస్తున్నది. తాజాగా మరో కొత్త రూల్ అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ కసరత్తు ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి జరిగే యూపీఐ పేమెంట్ రూ.2000 లోపు అయితే క్షణాల్లో పూర్తవుతుంది. అంతకు మించి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం కనీసం నాలుగు గంటల టైం ఉండే సిస్టమ్ అమల్లోకి తేవాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ నాలుగు గంటల్లో సంబంధిత ఖాతాదారు తన పేమెంట్ రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మోసాలను తేలిగ్గానే కట్టడి చేయొచ్చునని కేంద్రం భావిస్తున్నది.ఈ నిబంధనను ఇమిడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) పేమెంట్స్కూ ఈ షరతు వర్తింప చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం అమల్లో ఉన్న రూల్స్ ప్రకారం తొలిసారి యూపీఐ పేమెంట్స్ చేసేవారు ఒక రోజులో రూ.5000లకు మించి చేయకూడదు. ఇక నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (ఎన్ఈఎఫ్టీ) ట్రాన్సాక్షన్లలో ఒకసారి అవతలి వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 24 గంటల్లో రూ.50 వేలు మాత్రమే ట్రాన్స్ ఫర్ చేసే వెసులుబాటు ఉంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 13,530 ఆన్ లైన్ మోసాలు జరిగాయని ఆర్బీఐ నివేదికలో తేలింది. ఈ మోసాల మొత్తం విలువ రూ.30,252 కోట్లు. ఇందులో 49 శాతం ఆన్ లైన్ చెల్లింపుల మోసాలే కావడం గమనార్హం.