FAME-II | న్యూఢిల్లీ, మార్చి 9: విద్యుత్‌తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్-2 స్కీం గడువును పెంచే ఉద్దేశం కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. ఈ ఫేమ్-2 గడువు ఈ నెల 31న ముగియనున్నది. ఈ స్కీంను జూలై 31 వరకు పెంచబోతున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా స్పందించింది.
అలాంటి ఉద్దేశమేది కేంద్రం వద్ద లేదని, ఈ నెల 31 లోపు ఎలక్ట్రిక్ వాహనాలను సబ్సిడీ ధరకు కొనుగోలు చేయవచ్చునని లేదా ఈ స్కీం కోసం కేటాయించిన నిధులు ఉన్నంత వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫేమ్-2 కోసం కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులు రూ.10 వేల కోట్ల నుంచి రూ.11,500 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. వీటిలో ఎలక్ట్రిక్ టూ-వీలర్, త్రీ-వీలర్, ఫోర్-వీలర్ వాహనాలపై రూ.7,048 కోట్లు సబ్సిడీ చెల్లింపులు జరిపింది.