న్యూఢిల్లీ, డిసెంబర్ 6 : బంగారం కడ్డీలపై కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన రత్నాలు-ఆభరణాల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. బంగారు ఆభరణాలపై 2021 నుంచి హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటానికి, ముఖ్యంగా కొనుగోలుదారులకు నాణ్యమైనవి అందించాలనే ఉద్దేశంతో ఈ హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ రంగం లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నాలుగేండ్ల క్రితం అమలులోకి వచ్చిన హాల్‌మార్కింగ్ విధానంతో 40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు హాల్‌మార్కింగ్ వేసుకున్నట్లు తెలిపారు. 2023లో 44 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ బంగారు, ఆభరణాల మార్కెట్ 2030 నాటికి 134 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తంచేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం ఎగుమతి కలిగిన భారత్..మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 3.5 శాతంగా ఉన్నదన్నారు. ఇప్పటి వరకు 1.95 లక్షల రిజిస్ట్రర్డ్ జ్యూవెల్లర్లు హాల్‌మార్కింగ్ ఆభరణాలను విక్రయిస్తున్నారు.