EPFO | ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సర డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించి వేసింది. ఇంతకుముందు 8.5 శాతంగా ఉన్న వడ్డీరేటును 8.1 శాతానికి కుదిస్తూ కేంద్ర కార్మికశాఖ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్రం ఆమోదించిన తర్వాత కార్మికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
దీని ప్రకారం సబ్స్క్రైబర్ల ఖాతాల్లో గతేడాది డిపాజిట్లపై వడ్డీరేటును జమ చేసే ప్రక్రియను ఈపీఎఫ్‌వో చేపట్టింది. ఇంతకుముందు ఈపీఎఫ్‌వో 2020-21లో 8.5 శాతం వడ్డీరేటు చెల్లించింది. తాజాగా 8.1 శాతానికి తగ్గించడం నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయితో సమానం. ఇంతకుముందు 1977-78లో ఈపీఎఫ్ వడ్డీరేటు 8 శాతం.
గత నాలుగేండ్లలో పలుసార్లు ఈపీఎఫ్‌వోలో సభ్యుల డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించేశారు. 2017-18లో 8.55 శాతంగా ఉన్న వడ్డీరేటు 2018-19లో 8.65 శాతానికి 2019-20లో 8.5 శాతానికి మారుస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకున్నది. 2011-12లో ఈపీఎఫ్‌వోలో సభ్యుల డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీరేటు లభించింది.
కాగా, గత మార్చిలో 15.32 లక్షల మంది సబ్స్క్రైబర్లు చేరితే, ఫిబ్రవరిలో 12.85 లక్షల మంది జత కలిశారు. ఫిబ్రవరితోతో పోలిస్తే 2.47 లక్షల మంది సభ్యులు మార్చిలో పెరిగారు. మొత్తం ఈపీఎఫ్‌వోలో ఐదు కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.