Congress Govt | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఎవరి స్థలంలో వాళ్లు ఇల్లు కట్టుకోవడం సహజం. అదే మన స్థలం మరెవరికో ఇచ్చి, మనం వెళ్లి పక్కవాళ్ల స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంది. మన రాష్ట్రంలో కొత్త విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రైవేట్‌కు కట్టబెడుతున్నది. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలైన జెన్కో, సింగరేణి ద్వారా ఇతర రాష్ర్టాల్లో ప్లాంట్లు ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నది. మన దగ్గర ప్రైవేట్ ప్లాంట్లకు గేట్లు తెరిచి, మన విద్యుత్తు సంస్థల చేత రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో విద్యుత్తు ప్లాంట్లను నిర్మిస్తున్నది. ప్రభుత్వ తీరును విద్యుత్తురంగ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నారు.
విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణ విషయంలో జెన్కో, సింగరేణి సంస్థలు ఆరితేరాయి. జెన్కో థర్మల్, హైడల్ విద్యుత్తు ప్లాంట్లు నిర్మించగా.. సింగరేణి థర్మల్, సోలార్ ప్లాంట్లను నిర్మించడంతోపాటు రామగుండంలో కొత్తగా పంప్‌స్టోరేజీ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ రెండు సంస్థలను కాదని ప్రభుత్వం కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రైవేట్‌కు కట్టబెడుతున్నది. ఆ రెండు సంస్థల చేత రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో కొత్త ప్లాంట్లు పెట్టిస్తున్నది. ప్రభుత్వ సంస్థలతో సొంత రాష్ర్టాన్ని వదిలి ఇతర రాష్ర్టాల్లో పెట్టుబడులు పెట్టించడం ఎందుకో.. దీని వెనుకున్న మతలబేమిటోనని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఇటీవలే గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించింది. ఈ పాలసీకి క్యాబినెట్లో ఆమోదం లభించింది. అయితే దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రప్రభుత్వం విద్యుత్తు రంగంలో 66 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నది. దావోస్ సదస్సుకు ముందే సర్కారు గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది. తాజాగా వచ్చిన పెట్టుబడులన్నీ గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించినవే. అంటే దావోస్ సదస్సుకు ముందే పాలసీ రూపొందించడం వెనుక ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాలన్న ముందస్తు కుట్ర దాగి ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. హడావిడిగా పాలసీ రూపకల్పన వెనుక ఇదే కోణం దాగి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.