న్యూఢిల్లీ, నవంబర్ 5: హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్)లో 2.5 శాతం వరకు వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా జరిగే ఈ విక్రయంలో ఒక్కో షేర్ ఫ్లోర్ ధరను రూ.505గా నిర్ణయించారు. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ట్రేడింగ్‌లో మంగళవారం ముగిసిన ధర (రూ.559.45)తో పోల్చితే ఇది 9.7 శాతం తక్కువ. సోమవారం ట్రేడింగ్‌తో చూస్తే సంస్థ షేర్ విలువ 2.99 శాతం లాభపడటం గమనార్హం. కాగా, రెండు రోజులపాటు జరిగే ఈ ఓఎఫ్ఎస్ ద్వారా రూ.5,000 కోట్ల నిధులను మోదీ సర్కారు సమీకరించే వీలున్నది. బుధవారం సంస్థాగత మదుపరులు (నాన్-రిటైల్ ఇన్వెస్టర్లు), గురువారం రిటైల్ ఇన్వెస్టర్లు బిడ్డింగ్ చేసుకోవచ్చు. ఇదిలావుంటే అమ్మేస్తున్న 2.5 శాతం వాటాలో ఈక్విటీ 1.25 శాతంగా ఉంటే, మరో 1.25 శాతం గ్రీన్‌షూ ఆప్షన్‌గా ఉందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.