భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పట్ల కేంద్ర ప్రభుత్వం విశ్వాసం ప్రకటించింది. మరో మూడేండ్ల పాటు ఆయన ఆ పదవీకాలం పొడిగింపునిచ్చారు. అంటే 2024 డిసెంబర్ వరకు ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ కొనసాగుతారు. 1980వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత దాస్.. 2018 డిసెంబర్ 12న ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ తన పదవీ కాలానికి ముందే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కేంద్రం శక్తికాంత దాస్‌ను నియమించింది. ఈ ఏడాది డిసెంబర్ 10తో ఆయన పదవీ కాలం ముగియనున్నది.
గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రధాని మోదీ సారధ్యంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ శక్తికాంత దాస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి వేళ వివిధ పరిశ్రమలు మూతపడి.. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడంతో వ్యవస్థలో ద్రవ్య లభ్యత సంక్షోభం ముందుకొచ్చింది. ఈ సమస్య పరిష్కారానికి ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ రంగంలోకి దిగారు. ద్రవ్యపరపతి విధానంలో వడ్డీరేట్లు తగ్గించారు. ప్రస్తుతం వివిధ రుణాలపై వడ్డీరేట్లు 6.44 శాతం నుంచి ప్రారంభం అవుతుండగా, డిపాజిట్లపై 5 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. దీంతో దేశీయంగా ఇండ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
ఉద్దీపన ప్యాకేజీలతోపాటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పూనుకున్నారు. ప్రత్యేకించి ఆరు నెలల పాటు రుణ బకాయిల వసూళ్లపై మారటోరియం విధించడంతో సత్ఫలితాలొచ్చాయి. కష్టాల్లో చిక్కుకున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలిచ్చారు. మరోవైపు కేంద్రంతో సమన్వయం చేసుకున్నారు. కరోనా రెండో వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నది. ఈ తరుణంలో ఎకానమీకి మరింత బూస్ట్‌నిచ్చేందుకు శక్తికాంత దాస్ వ్యూహాలు అవసరం అని కేంద్రం భావించినట్లు తెలుస్తున్నది.
1980వ బ్యాచ్ తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శక్తికాంత దాస్.. 2017 వరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ కార్యదర్శిగా పని చేశారు. 2016లో నోట్ల రద్దు టైంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆర్థికశాఖలో పని చేస్తున్నప్పుడు 8 బడ్జెట్ల రూపకల్పనలో భాగస్వామి అయ్యారు. ఆర్థికం, పన్నులు, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 38 ఏండ్ల కెరీర్లో శక్తికాంత దాస్ వివిధ బాధ్యతలు నిర్వర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
puneeth rajkumar | వయసు 46 ఏండ్లే.. కానీ 45 ఏళ్ల సినీ కెరీర్ ఆయన సొంతం
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్