Google | సెర్చింజన్ గూగుల్ ఉద్యోగులకు ప్రోత్సాహాలు అందించడంలో ఎల్లవేళలా ముందే నిలుస్తుంది. కానీ.. ఆర్థిక మాంద్యం ముప్పుతో భారీగా ఉద్యోగులను ఇండ్లకు సాగనంపిన గూగుల్‌కు ఇప్పుడు ఈ తరహా ప్రోత్సాహాలు భారంగా మారాయి. ఇక నుంచి సిబ్బందికి అందజేసే చిరు తిండ్లు, లాండ్రీ సర్వీస్, మధ్యాహ్న భోజనం వంటి వసతులను నిలిపేయాలని గూగుల్ నిర్ణయం తీసుకున్నది. పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) రూత్ పోరాట్ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు.
అంతేకాదు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవడమే గూగుల్ ప్రాధాన్యంగా కనిపిస్తున్నది. అందుకే కొత్త ఉద్యోగుల నియామకాలు కూడా నిలిపేస్తున్నామని రూత్ పోరాట్ పేర్కొన్నారు. సంస్థలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు, వనరుల్ని.. ప్రాధాన్యాలకు అనుగుణంగా వినియోగించుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో కొందరు సిబ్బందిని ఇతర విభాగాలు, వర్క్ల్లోకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
మున్ముందు సంస్థ, సిబ్బంది అవసరాల కోసం లాప్టాప్ల కొనుగోళ్లు కూడా తగ్గిస్తామని రూత్ పోరాట్ తెలిపారు. ఆఫీసులు ఉన్న ప్రాంతాలు, అక్కడ అందుబాటులో ఉన్న వసతులను బట్టి ప్రోత్సాహాల నిలిపివేతలో మారర్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పటికే పొదుపు చర్యల్లో భాగంగా 12 వేల మంది ఉద్యోగులను గూగుల్ ఇండ్లకు సాగనంపిన సంగతి తెలిసిందే.