Google Play Store | యాప్‌లపై టెక్ దిగ్గజం గూగుల్ కొరడా ఝుళిపించింది. ప్లే స్టోర్ నుంచి గూగుల్ 77 ప్రమాదకరమైన యాప్‌లను తొలగించింది. ఆయా యాప్‌లన్నీ వినియోగదారుల భద్రత, గోప్యతకు ముప్పుగా మారడంతో చర్యలు తీసుకున్నది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. గూగుల్ గత సంవత్సరం సుమారు 40 లక్షల యాప్‌లను తొలగించింది. సగటున ప్రతిరోజూ 11వేల యాప్‌లను ప్లే స్టోర్ నుంచి వేటు వేసింది. నివేదిక ప్రకారం.. తొలగించబడిన యాప్‌లలో సగానికి పైగా డేటా భద్రత, గోప్యతా నియమాలను ఉల్లంఘిస్తున్నాయని తేలింది. గూగుల్ గత సంవత్సరం యాప్ ప్లబిషింగ్కు సంబంధించి కఠినమైన నియమాలను అమలు చేస్తామని ప్రకటించింది.
ఇప్పుడు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ప్రారంభం నాటికి ప్లే స్టోర్‌లో ఉన్న దాదాపు సగం యాప్‌లను తొలగించారు. గూగుల్ ఈ సంవత్సరం దాదాపు 1.55 లక్షల డెవలపర్ ఖాతాలను కూడా బ్లాక్ చేసింది. కంపెనీ ఇప్పుడు సైడ్‌లోడెడ్ యాప్‌లపై కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ధ్రువీకరణ ప్రక్రియ ద్వారా వెళ్లే డెవలపర్స్ మాత్రమే యాప్‌లను ప్రచురించగలరని గూగుల్ చెబుతోంది. ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ అదృశ్యమైతే.. దాని అర్థం డెవలపర్ దాన్ని తీసివేసినట్లు కాదని గూగుల్ వినియోగదారులను హెచ్చరించింది. తరచుగా దీనికి కారణం యాప్ నియమాలను ఉల్లంఘించడమే.
అయితే, యాప్ ఇప్పటికే మీ ఫోన్లో ఉంటే.. అది రన్ అవుతూనే ఉంటుంది. కానీ, అది మరిన్ని అప్డేట్లు అందవు. యాప్ ప్రమాదకరమైనదిగా తేలితే.. ప్లే ప్రొటెక్ట్ దాన్ని అన్ ఇన్స్టాల్ చేయమని హెచ్చరిస్తుంది అని కంపెనీ స్పష్టం చేసింది. కానీ, అలాంటి హెచ్చరిక రాకపోతే యాప్ భద్రతా అప్డేట్స్ లేకుండా మీ ఫోన్లో రన్ అవుతూనే ఉంటుంది. యూజర్లు సురక్షితంగా డౌన్లోడ్ చేసుకునే అలవాటును మార్చుకోవాలని నిపుణులు అంటున్నారు. యాప్‌లను డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అనుమతులను తనిఖీ చేయాలని.. రివ్యూలను చదవాలని.. విశ్వసనీయ డెవలపర్ల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్స్టాల్ నివేదిక పేర్కొంది. ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. గూగుల్ ప్రస్తుతం ప్లే స్టోర్‌లో కొత్త ‘అన్ఇన్స్టాల్’ బటన్‌ను పరీక్షిస్తోంది. ఈ బటన్ యాప్ పేజీలో నేరుగా కనిపిస్తుంది. తద్వారా వినియోగదారులు తమ ఫోన్ నుంచి ఏదైనా యాప్‌ను వెంటనే తీసివేసే అవకాశం ఉంది.