Google Pixel 9 | గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ (Google) తన గూగుల్ పిక్సెల్ 9 (Google Pixel 9) సిరీస్ ఫోన్లను మంగళవారం గ్లోబల్ మార్కెట్లు, 14న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌తోపాటు దేశంలోని ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు లభిస్తాయని తెలిపింది. భారత్ మార్కెట్లో ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో లభించడం ఇదే తొలిసారి. భారత్ లో నాలుగింట రెండు గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లను మాత్రమే ఆవిష్కరిస్తుందని సమాచారం.
దేశంలోని రిలయన్స్ డిజిటల్, క్రోమా రిటైల్ స్టోర్లలో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు లభిస్తాయని టీజర్లు తెలుపుతున్నాయి. ఈ మేరకు గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల ప్రీ బుకింగ్స్ కోసం రిలయన్స్ డిజిటల్, క్రోమా సంస్థల ఈ-షాపింగ్ పోర్టల్స్ డెడికేట్ చేశాయి. ఆసక్తిగల యూజర్లు తమకు సమీపంలోని రిలయన్స్ డిజిటల్, క్రోమా స్టోర్లలో ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు. భారత్‌లో గూగుల్ అధికారిక భాగస్వామి ఫ్లిప్ కార్ట్ తోపాటు గూగుల్ వెబ్ సైట్ ద్వారా కూడా గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లను ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. భారత్‌లో గూగుల్ తన పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్లను ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది.