Google | సెర్చింజన్ `గూగుల్`పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. భారత్‌లో అక్రమ డిజిటల్ లోన్ యాప్‌ల వాడకాన్ని కట్టడి చేయడానికి కట్టిన నిబంధనలు అమలు చేయాలని గూగుల్‌ను కేంద్రం, ఆర్బీఐ కోరినట్లు సమాచారం. ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి గూగుల్ రాదు. కానీ గత కొన్ని నెలలుగా కేంద్రం, ఆర్బీఐ అధికారులతో జరిగిన పలు సమావేశాలకు గూగుల్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇల్లీగల్ డిజిటల్ లోన్ యాప్స్ అదుపు చేయడానికి కఠిన నిబంధనలు అమలు చేయాలని గూగుల్ ప్రతినిధులను కేంద్రం, ఆర్బీఐ కోరిందని తెలుస్తున్నది. కరోనా మహమ్మారి ఉధృతి సాగుతున్న వేళ పాపులరైన ఇల్లీగల్ లెండింగ్ యాప్స్ భరతం పట్టేందుకు చర్యలు తీసుకోవాలని భారతీయ బ్యాంకులను ఆర్బీఐ ఇప్పటికే కోరింది.
అధిక వడ్డీరేట్ల వసూళ్లు, అధిక ఫీజుల వసూళ్లు, ఆర్బీఐ ఆమోదించని రికవరీ పద్దతులు, హవాలా లావాదేవీల నిబంధనలు- ప్రభుత్వ మార్గదర్శకాలను ఈ ఇల్లీగల్ డిజిటల్ లెండింగ్ యాప్స్ ఉల్లంఘిస్తున్నాయి. అటువంటి యాప్స్ విస్తరించకుండా తగు నియంత్రణ చర్యలు తీసుకోవాలని గూగుల్‌ను ఆర్బీఐ కోరుతున్నది. ఇల్లీగల్ డిజిటల్ లెండింగ్ యాప్స్ పని పట్టేందుకు కేంద్రం.. ఆర్బీఐ కలిసి ధృవీకృత లెండింగ్ యాప్స్ జాబితాతో కూడిన శ్వేతపత్రం తయారుచేసే పనిలో పడ్డాయి.
ఫైనాన్సియల్ సర్వీస్ యాప్స్ కోసం గతేడాది గూగుల్ తన ప్లేస్టోర్ డెవలపర్ ప్రోగ్రామ్ పాలసీని సవరించింది. ప్రత్యేకించి భారత్‌లో పర్సనల్ లోన్లు ఇవ్వడానికి యాప్స్‌కు అదనపు నిబంధనలను గతేడాది సెప్టెంబర్‌లో తీసుకొచ్చింది. ప్లే పాలసీ నిబంధనలను ఉల్లంఘించిన 2000కి పైగా పర్సనల్ లోన్ యాప్‌లను భారత్‌లో తొలగించాం అని గూగుల్ అధికార ప్రతినిధి చెప్పారు. ప్రారంభంలో ఇటువంటి యాప్‌లపై ఫిర్యాదు చేసినా గూగుల్ పట్టించుకునేది కాదని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. కానీ, ప్రస్తుతం యాప్స్‌పై తాము చేసే ఫిర్యాదులపై చాలా క్రియాశీలంగా చర్యలు చేపడుతుందని ఆ వర్గాల కథనం.
భారత్‌లోని యాప్ మార్కెట్‌పై గూగుల్‌దే పెత్తనం. స్మార్ట్ ఫోన్ యూజర్లలో 95 శాతం గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ సేవలను వాడుతున్నారు. భారత్‌లో చట్ట విరుద్ధ డిజిటల్ లెండింగ్ యాప్స్‌ను నియంత్రించడానికి గూగుల్‌పై ఒత్తిడి తెచ్చారన్న విషయమై స్పందించడానికి కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ, ఆర్బీఐ అందుబాటులోకి రాలేదు.