 
                                                            న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : జియో వినియోగదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గూగుల్ భాగస్వామ్యంతో తమ కృత్రిమ మేధస్సు (ఏఐ) సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్.. ఎంపికచేసిన జియో కస్టమర్లకు ఏడాదిన్నర (18 నెలలు)పాటు గూగుల్ ఏఐ ప్రో ఉచిత వినియోగానికి అనుమతినిస్తుందని ఆర్ఐఎల్ గురువారం ప్రకటించింది. అయితే రూ.35,100 విలువైన ఈ ఆఫర్.. తొలుత జియో 5జీ యూజర్లకే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నది. ఇక ఈ రిలయన్స్-గూగుల్ ఆఫర్లో కస్టమర్లకు జెమిని యాప్‌లో గూగుల్ జెమిని 2.5 ప్రో మాడల్‌కు హైయర్ యాక్సెస్ కూడా ఉంటుంది.
అలాగే నానో బనానా, వియో 3.1 మాడల్స్‌తో అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అధ్యయనం-పరిశోధనల కోసం నోట్‌బుక్ ఎల్ఎంను వాడుకోవచ్చు. 2టీబీ క్లౌడ్ స్టోరేజీ తదితర సౌలభ్యాలు కూడా ఉంటాయని ఓ ప్రకటనలో ఆర్ఐఎల్ స్పష్టం చేసింది. కాగా, ఓపెన్ఏఐ భారత్‌లోని వినియోగదారులకు ఏడాదిపాటు ఉచితంగా ‘చాట్‌జీపీటీ గో’ సేవలను ఆఫర్ చేసింది. నవంబర్ 4 నుంచి ఈ పరిమిత వ్యవధి ప్రమోషనల్ ఆఫర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రిలయన్స్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్రస్తుతం ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ గో సేవలు పొందాలంటే నెలకు రూ.399 చెల్లించాల్సి ఉంటుంది.
 
                            