న్యూఢిల్లీ, జూన్ 16: వరుసగా రెండు నెలలుగా పెరుగుతూ వచ్చిన ఎగుమతులు మళ్లీ డీలాపడ్డాయి. గడిచిన నెలకుగాను ఎగుమతులు 2.17 శాతం తగ్గాయి. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన ఎగుమతులతో పోలిస్తే 38.73 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇదే నెలలో దేశీయ దిగుమతులు కూడా ఏడాది ప్రాతిపదికన 1.7 శాతం తగ్గి 60.61 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. దీంతో వాణిజ్యలోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) 21.88 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో 22.51 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు..ఏప్రిల్ నెలలో 26.42 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పసిడి, క్రూడాయిల్ దిగుమతులు తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలు(ఏప్రిల్ నుంచి మే వరకు) ఎగుమతులు 3.11 శాతం పెరిగి 77.19 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 8 శాతం ఎగబాకి 125.52 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్యలోటు 48.33 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో దేశీయ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయి.
గత నెలలో బియ్యం, ఇనుప ఖనిజం, జెమ్స్ అండ్ జ్యువెల్లరీ, ఇంజినీరింగ్, పలు టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులు ప్రతికూలానికి పడిపోయాయి. దీంతోపాటు పెట్రోలియం ప్రొడక్ట్ ఎగుమతులు కూడా 30 శాతం పడిపోయి 5.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే నెలలో క్రూడాయిల్ దిగుమతులు 26.14 శాతం తగ్గి 14.75 బిలియన్ డాలర్లకు పరిమితమవగా, గోల్డ్ దిగుమతులు 12.6 శాతం తగ్గి 2.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.