Vistara | టాటా సన్స్ ఆధ్వర్యంలోని ఫుల్ సర్వీస్ ఎయిర్ లైన్స్ విస్తారా హిస్టరీ ఇక కాలగర్భంలో కలిసిపోనున్నది. మరో టాటా సన్స్ అనుబంధ ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్ లైన్స్ విలీనం పూర్తయింది. ప్రీమియం సర్వీసులతో ప్రయాణికుల హృదయాలను గెలుచుకున్న విస్తారా ఎయిర్ లైన్స్.. మంగళవారం ఎయిర్ ఇండియాలో అధికారికంగా విలీనం అవుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఒక జాతీయ, మరొక అంతర్జాతీయ విమాన సర్వీసుతో విస్తారా ఎయిర్ లైన్స్ ప్రయాణం ముగిసిపోనున్నది.
ముంబై-ఢిల్లీ మధ్య విస్తారా యూకే986 విమానం సోమవారం రాత్రి 10.50 గంటలకు, ఢిల్లీ -సింగపూర్ మధ్య నడిచే యూకే 115 విమానం రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది. మంగళవారం నుంచి విస్తారా ఎయిర్ లైన్స్ విమాన కోడ్ ‘యూకే’ స్థానే.. ఏఐ2ఎక్స్ఎక్స్ఎక్స్ఎక్స్ పేరిట కొత్త కోడ్ వస్తుంది. సరిగా పదేండ్ల క్రితం 2015 జనవరి తొమ్మిదో తేదీన ఢిల్లీ-ముంబై మధ్యే విస్తారా విమాన సర్వీసు ప్రారంభం కావడం ఆసక్తికర పరిణామం.
విస్తారా ఎయిర్ లైన్స్ లో టాటా గ్రూపుకు 51 శాతం, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 49 శాతం వాటాలు ఉన్నాయి. 2015లో కార్యకలాపాలు ప్రారంభించిన విస్తారా ఎయిర్ లైన్స్.. ఎయిర్ ఇండియాలో విలీనం అయిన తర్వాత సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థకు 25.1 శాతం వాటా ఉంటుంది. విస్తారా విలీనం తర్వాత ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ రూ.3,195 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. ఇప్పటికే టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో.. ఎఐఎక్స్ కనెక్ట్ సంస్థ గత నెలలో విలీనమైంది.