న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో)లోని సభ్యులందరికీ గతంలో పెంచిన బీమా ప్రయోజనాలను పొడిగిస్తున్నట్టు గురువారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. దీంతో ఉద్యోగ భవిష్య నిధి ఈపీఎఫ్వోలోని 6 కోట్లకుపైగా సభ్యులకు రూ.7 లక్షలదాకా జీవిత బీమా కవరేజీ రానున్నది. ఈ కవరేజీ పొడిగింపు ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచే వర్తిస్తుందని కూడా ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రి స్పష్టం చేశారు. ఈడీఎల్ఐ స్కీంను 1976లో ప్రారంభించారు. ఈపీఎఫ్వో సభ్యులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతనిచ్చేలా బీమా ప్రయోజనాలను ఇందులో కల్పించారు. అయితే 2021 ఏప్రిల్ 28న వచ్చే మూడేండ్లకుగాను ఈ పథకం కనీస బీమా కవరేజీని రూ.2.5 లక్షలకు, గరిష్ఠ బీమా కవరేజీని రూ.7 లక్షలకు పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్ 27తో ఆ వ్యవధి పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తాజా ప్రకటన వచ్చింది. దీంతో ఏప్రిల్ 28 తర్వాత మరణించిన ఈపీఎఫ్వో సభ్యులకూ ఇకపై అధిక బీమా ప్రయోజనం దక్కనున్నది. ఇదిలావుంటే కంపెనీలో వరుసగా 12 నెలల సర్వీస్ ఉన్నవారికి ఈ బీమా వర్తిస్తుందన్న నిబంధననూ సడలించారు. ఉద్యోగాలు మారినా బీమా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ బీమాకు సంబంధించి ఉద్యోగుల తరఫున కంపెనీలే చెల్లిస్తాయి.