Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.900 తగ్గి రూ.61,300 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో బలహీనతల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్ పైనా పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. కిలో వెండి ధర కూడా రూ.200 పతనమై రూ.76,000 వద్ద స్థిర పడింది. ఆదివారం 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.62 వేలుగా స్థిరపడింది.
అమెరికాలో జాబ్స్ డేటా పుంజుకున్న తర్వాత యూఎస్ ట్రెజరీ బాండ్లు, డాలర్ విలువ కూడా పెరగడంతో ఇన్వెస్టర్లు బంగారంపై సోమవారం ఇన్వెస్ట్మెంట్లు తగ్గించారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
ఓవర్సీస్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1995 డాలర్ల వద్ద తచ్చాడుతుంటే, ఔన్స్ వెండి ధర 22.98 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ ధర 10 డాలర్లు తగ్గి 1995 డాలర్లు పలికింది. గతవారం ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత బంగారం ధర బలహీన పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో సోమవారం రూ.95 తగ్గి, రూ.61,624 లకు చేరుకున్నది. యూఎస్ కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) డేటా విడుదలతోపాటు యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో బంగారానికి ధర తగ్గిందని సౌమిల్ గాంధీ తెలిపారు. న్యూయార్క్ లో బంగారం ఔన్స్ ధర 0.06 శాతం తగ్గుముఖం పట్టి, 2013 డాలర్ల వద్ద నిలిచింది.