Gold-Silver Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.350 తగ్గి రూ.63,950 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. గురువారం రూ.64,300 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
బంగారంతోపాటు ఢిల్లీలో కిలో వెండి ధర కూడా రూ.1000 తగ్గి రూ.78,500 వద్ద ముగిసింది. గురువారం కిలో వెండి ధర రూ.79,500 వద్ద స్థిర పడింది. ఫ్యూచర్స్ మార్కెట్.. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.244 తగ్గుముఖం పట్టి రూ.63,145 వద్ద ముగిసింది. మార్చి కాంట్రాక్ట్ కిలో వెండి ధర రూ.1166 క్షీణించి రూ.73,793 వద్ద పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2070 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.80 డాలర్లు పలుకుతున్నది. గురువారం బంగారం ధర మూడు వారాల గరిష్ట స్థాయిని తాకడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో కామెక్స్ గోల్డ్ ధర తగ్గుముఖం పట్టిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ మెరుగు పడటంతో బంగారం ధరలు పడిపోయాయని చెప్పారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్, తమిళనాడు రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.350 తగ్గి, రూ.58,550 వద్ద స్థిర పడితే, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.380 పతనంతో రూ.63,870 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.130 తగ్గి, రూ.79,700 వద్ద స్థిర పడింది. చెన్నైలో 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.380 తగ్గి రూ.59,000, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.64,470 వద్ద పలుకుతున్నది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.350 వద్ద తగ్గి రూ.58,550 వద్ద స్థిర పడింది. 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.380 పతనంతో రూ.63,870 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.77 వేల వద్ద కొనసాగుతున్నది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, మహారాష్ట్ర రాజధాని ముంబైలలో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం పది గ్రాములు ధర రూ.350 తగ్గి రూ.58,550 పలికితే, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.380 పడిపోయి రూ.63,870 పలుకుతున్నది. ఇక కిలో వెండి ధర రూ.120 పతనంతో రూ.78,300 పలుకుతున్నది.