న్యూఢిల్లీ, జూలై 21: దేశంలో శ్రీమంతులు సంపద సృష్టిలో రూటు మార్చారు. ఇన్నాళ్లూ బంగారం నిల్వలను పెంచుతూపోయినవారంతా.. ఇప్పుడు వాటిని తగ్గించి బిట్కాయిన్లపై దృష్టిసారిస్తున్నారు మరి. ప్రధానంగా అపర కుబేరులు (హై నెట్‌వర్త్ ఇండివీడ్యువల్స్ లేదా హెచ్ఎన్ఐ) క్రిప్టో వంటి బిట్కాయిన్లలో తమ పెట్టుబడులను 2 నుంచి 5 శాతం పెంచేశారు. ముఖ్యంగా కుటుంబ సంపద నిర్వహణలో తర్వాతి తరం వారసులు సంప్రదాయ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల కంటే డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కే పెద్దపీట వేస్తున్నారని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
ఇదీ సంగతి..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన దగ్గర్నుంచి మార్కెట్లో పెట్టుబడుల స్వరూపమే మారిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బిట్‌కాయిన్స్, ఎంథిరన్, సొలానా వంటి డిజిటల్ అసెట్స్‌కు మరింత ఆదరణ పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఈ ట్రెండ్‌ను భారతీయ సంపన్న వర్గాలూ అనుసరిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమ పెట్టుబడుల్లో కొంతమేర క్రిప్టోకరెన్సీలకూ కేటాయిస్తున్నారు. బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లను కొన్ని గ్లోబల్ కంపెనీలు తీసుకురావడంతో వీటిని ప్రధాన పెట్టుబడుల్లో ఒకటిగా ఇన్వెస్టర్లు చూడటం మొదలుపెట్టారు.
రిస్క్ ఉన్నా..
క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు అత్యంత ఒడిదొడుకులతోకూడి ఉంటాయన్న అభిప్రాయాలున్నాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం వీటికి అధికారికంగా మద్దతునివ్వలేకపోతున్నది. అయితే ఇటీవలికాలంలో పసిడి ధరలు క్రమేణా పెరుగుతూపోతున్నా.. అప్ అండ్ డౌన్స్ కూడా సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. కానీ గోల్డ్ రేట్లతో పోల్చితే బిట్కాయిన్ల విలువ గణనీయంగా పెరుగుతున్నది. ఫలితంగా ఆధునిక ఇన్వెస్టర్ల చూపు సహజంగానే వీటిపై పడుతున్నదని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక భారత్‌లో క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను పడుతున్నది. అలాగే 1 శాతం టీడీఎస్ కూడా వర్తిస్తున్నది. దీంతో గరిష్ఠ లాభాలను ఈ పన్నులే తినేస్తున్నట్టవుతున్నది. ఇది కొంతమేర మదుపరులను క్రిప్టో పెట్టుబడులకు వెళ్లకుండా కళ్లెం వేస్తున్నదని చెప్పవచ్చు. ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ కోటి రూపాయల పైనే పలుకుతున్నది.
స్వల్పంగా పెరిగిన బంగారం ధర
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి ధర రూ.250 పెరిగి రూ.99,020గా ఉన్నట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. కాగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం ధర రూ.110 పెరిగి రూ.1,00,150గా, 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రూ.100 పుంజుకొని రూ.91,800గా ఉన్నాయి. ఇక వెండి కిలో ధర ఢిల్లీలో రూ.500 అందుకుని రూ.1,11,000గా ఉన్నది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 15.16 డాలర్లు పెరిగి 3,365.56 డాలర్లకు చేరింది. అమెరికా టారిఫ్ పాలసీ, ఆ దేశ కరెన్సీ డాలర్ వాల్యూ.. గోల్డ్ మార్కెట్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.