Gold Rates | జాతీయ, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులతో ఎనిమిది రోజులుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు సోమవారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ బలహీనతల నేపథ్యంలో సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.100 తగ్గి, రికార్డు గరిష్టం నుంచి దిగి వచ్చింది. 2025లో తొలిసారి సమావేశమై యూఎస్ ఫెడ్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)లు వడ్డీరేట్లపై బుధవారం ప్రకటన చేయనున్నాయి. ఈసీబీ, యూఎస్ ఫెడ్ రిజర్వ్‌లను నిర్ణయాన్ని బట్టి గురువారం బంగారం రేట్లలో మార్పులు జరుగవచ్చు.
శుక్రవారం తులం బంగారం (99.9శాతం స్వచ్ఛత) ధర రూ.200 వృద్ధితో రూ.83,100 పలికి జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. సోమవారం రూ.100 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.83,000 వద్ద స్థిర పడింది. సోమవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.100 తగ్గి రూ.82,600 లకు చేరుకుంది. శుక్రవారం రూ.82,700 వద్ద స్థిర పడిన సంగతి తెలిసిందే. మరోవైపు కిలో వెండి ధర సోమవారం రూ.2,000 పతనమై రూ.92,000 లకు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.94,000 వద్ద స్థిర పడింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.4 తగ్గి రూ.80,022 వద్ద ముగిసింది. శుక్రవారం రూ. 80,312లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. ఎల్కేపీ సెక్యూరిటీస్ కమొడిటీ అండ్ కరెన్సీ వైస్‌ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది స్పందిస్తూ ‘బంగారంపై ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపవచ్చు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయాన్ని బట్టి బంగారం ధరలు ఖరారవుతాయని’ అన్నారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తర్వాత తులం బంగారం ధర రూ. 79,000 – రూ.80,600 మధ్య తచ్చాడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.509 తగ్గి రూ.91,090 లకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 4.40 డాలర్ల పతనంతో 2,802.20 డాలర్ల వద్ద స్థిర పడింది. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 0.79 శాతం పతనమై 30.94 డాలర్ల వద్ద నిలిచింది.