Gold Rates | పది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.200 తగ్గి రూ.78,100లకు చేరుకున్నది. సోమవారం 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.78,300 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.200 తగ్గి రూ.77,700 పలికింది. సోమవారం ఇది రూ.77,900 వద్ద స్థిర పడింది. కానీ, కిలో వెండి ధర రూ.441 వృద్ధితో రూ.91,160 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం డిసెంబర్ డెలివరీ ధర రూ.347 వృద్ధితో రూ.75,958 పలికింది. శుక్రవారం వెలువడనున్న అమెరికా నాన్ ఫామ్ పే రోల్స్, నిరుద్యోగ డేటాపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇక గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం 0.34 శాతం వృద్ధితో 2668.50 వద్ద నిలిచింది. ఔన్స్ వెండి ధర 0.48 శాతం పుంజుకుని 31.61 డాలర్లకు చేరుకున్నది.