Gold Rates | పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. బంగారం ధరలు ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధరలు దిగి వస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో స్టాకిస్టులు అమ్మకాలకు దిగుతున్నారు. ఐదురోజుల తర్వాత సోమవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి పతనమయ్యాయి. 24 క్యారెట్ల బంగారంపై రూ.900 తగ్గి తులానికి రూ.1,02,520కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ ధర సైతం రూ.900 తగ్గడంతో తులానికి రూ.1,02,100కి చేరుకుంది. అయితే, బంగారం గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధర రూ.5800 పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. మార్కెట్లో బంగారానికి డిమాండ్ తగ్గడంతో ధర దిగివస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. ట్రంప్ శాంతి ప్రయత్నాల నేపథ్యంలో చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. అలాస్కాలో కలిసేందుకు అంగీకరించడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని, దాంతో విలువైన ఆస్తులకు డిమాండ్ తగ్గినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. గోల్డ్ బార్స్‌పై 39శాతం సుంకాలకు సంబంధించి వైట్‌హౌస్ స్పష్టతనివ్వడంతో ధరలపై ఒత్తిడి తెచ్చిందని తెలిపారు. సోమవారం వెండి ధర కిలోకు రూ.1000 తగ్గి రూ.1,14,000కి చేరుకుంది. వెండి సైతం గత ఐదురోజుల్లో కిలోకు రూ.2,500 పెరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌లో గోల్డ్ ఫ్యూచర్ ఔన్స్‌కు 40.61 డాలర్లు తగ్గి 3,358.17కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో అక్టోబర్ కాంట్రాక్టుకు సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు తగ్గి 1.26శాతం తగ్గి రూ.1,00,518 వద్ద ట్రేడవుతున్నది.
కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనత్ చైన్వాలా తెలిపిన ప్రకారం.. బంగారం ఒకశాతానికి తగ్గింది. గతవారంలో ధరల పెరుగుదల లాభాలన్నింటిని తుడిచిపెట్టేశాయి. బంగారం ఉత్పత్తులపై సుంకాలపై వచ్చిన వార్తలన్నీ తప్పుడు సమాచారంగా ట్రంప్ పరిపాలన పేర్కొనగా.. మార్కెట్ వర్గాలన్నీ మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాయి. స్పాట్ సిల్వర్ 1.39 శాతం తగ్గి ఔన్సుకు 37.81 డాలర్లకు చేరింది. ఏంజెల్ వన్‌లో వ్యవసాయేతర వస్తువులు, కరెన్సీల డీవీపీ పరిశోధన నిపుణుడు ప్రథమేష్ మాల్యా మాట్లాడుతూ సుంకాలు ప్రపంచవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించాయన్నారు. మరింత పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఔన్స్‌కు 3800 డాలర్ల వరకు చేరుకోవచ్చన్నారు. రాబోయే మూడు నెలల్లో ఎంసీఎక్స్ ఫ్యూచర్ పది గ్రాములకు రూ.1.10లక్షలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,02,280 పలుకుతుండగా.. 22 క్యారెట్ల పుత్తడి రూ.93,750గా ఉన్నది. కిలో వెండి రూ.1.27లక్షలు పలుకుతున్నది.