Gold Rate Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో ఇటీవల ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. ఆ తర్వాత ధరలు స్వల్పంగా దిగివచ్చినా మళ్లీ పైపైకి కదులుతున్నాయి. స్టాకిస్టులు కొనుగోలు చేయడంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పసిడి ధర మళ్లీ పెరిగింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. గురువారం 24 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరగడంతో తులం ధర రూ.1,01,420కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.400 పెరిగి తులానికి రూ.1,01,000కి పెరిగింది. అదే సమయంలో వెండి ధర సైతం భారీగానే పెరిగింది. రూ.1500 పెరిగి కిలోకు రూ.1,13,500లకు ఎగిసింది. సెప్టెంబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనాలున్నాయి. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. లేబర్ మార్కెట్లో మందగమనం సంకేతాలు అదనపు సడలింపులకు అవకాశం కల్పించాయని ఆగ్మాంట్ పరిశోధన విభాగాధిపతి రెనిషా చైనాని పేర్కొన్నారు.
ఇటీవల అమెరికా వినియోగదారుల ధరల సూచిక నివేదిక సుంకం ఆధారిత ద్రవ్యోల్బణ ఆందోళనలను తగ్గించిందని నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లో న్యూయార్క్‌లో బంగారం స్వల్పంగా పెరిగి ఔన్స్‌కు 3,356.96 డాలర్లకు చేరుకుంది. అయితే, స్పాట్ వెండి ఔన్సుకు 0.41 శాతం తగ్గి 38.35కి చేరింది. అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచిక, నిరుద్యోగ డేటా కంటే ముందస్తుగా బంగారం పెరుగుతూనే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనత్ చైన్వాలా మాట్లాడుతూ వాషింగ్టన్, బీజింగ్ ట్రేడ్ డీల్‌కు 90 విరామం ప్రకటించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఉక్రెయిన్, రష్యా నేతలతోనూ చర్చలు జరుపనున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌పై మరింత ప్రభావం కనిపించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) జతిన్ త్రివేది మాట్లాడుతూ డాలర్ బలహీనపడడం కారణంగా బంగారం ధరలకు మద్దతు లభించిందన్నారు. వివిధ దేశాలపై కొనసాగుతున్న సుంకాలు సైతం దోహదపడ్డాయన్నారు.