Gold Rate | బంగారం ధరలు సరికొత్త రికార్డులను చేరాయి. ఢిల్లీలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాములకు రూ.94,150 వద్ద కొనసాగుతున్నది. అమెరికా సుంకాలపై ఆందోళనల మధ్య బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయని ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ పేర్కొంది. మంగళవారం 99.9 శాతం ప్యూరిటీ గోల్డ్ బంగారం ధర రూ.2వేలు పెరగడంతో.. తులానికి రూ.94,150కి చేరింది. ప్రస్తుతం బుధవారం 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ బంగారం ధర రూ.93,700 వద్ద స్థిరంగా ఉన్నది. అమెరికా ప్రతీకార సుంకాల ముప్పు కారణంగా రాబోయే కాలంలో బంగారం ధరలు పెరగవచ్చని బంగారు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇక బుధవారం వెండి ధరలు రూ.1000 తగ్గి కిలోకు రూ.1,01,500కి చేరుకున్నాయి. మంగళవారం వెండి కిలోకు రూ.1,02,500 వద్ద ముగిసింది.
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లోని కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ ప్రకారం.. యూఎస్ సుంకాలు ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక రాజకీయ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడంలో పెట్టుబడిదారులు బిజీగా ఉన్నారన్నారు. అనిశ్చితి వాతావరణంలో బంగారం, వెండి ధరలు సాధారణంగా పెరుగుతాయని పేర్కొన్నారు. మరో వైపు గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.11శాతం పెరిగి ఔన్స్‌కు 3,116.86కి చేరుకుంది. దాంతో పాటు జూన్ డెలివరీకి సంబంధించిన కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 3,149.30 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నది. ఆసియా మార్కెట్లో స్పాట్ సిల్వర్ 0.52 శాతం పెరిగి ఔన్స్‌కు 33.87 డాలర్లకు చేరింది. కోటక్ సెక్యూరిటీస్‌లోని ఏవీపీ కమోడిటీ రీసెర్చ్ కైనాట్ చైన్వాలా మాట్లాడుతూ.. యూఎస్ జాబ్స్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానం గురించి అవసరమైన సమాచారం ఇస్తుందని పేర్కొన్నారు.