Gold Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. వ్యాపారులు, రిటైలర్ల నుంచి భారీ డిమాండ్ నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులానికి రూ.6,250 పెరిగి రికార్డు స్థాయిలో రూ.96,450కి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తల కారణంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో ధర ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. బుధవారం 99.9 ప్యూరిటీ గోల్డ్ తులానికి రూ.90,200 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. వరుసగా నాలుగు రోజుల పాటు తగ్గుముఖం పెట్టిన బంగారం.. ఒకే రోజు అమాంతం పెరిగాయి. ఇక 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర రూ.6,250 పెరిగి పది గ్రాములకు రూ.96,000 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వెండి ధర కిలోకు రూ.2,300 పెరిగి రూ.95,500కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్లో వెండి ధర కిలోకు రూ.93,200 వద్ద ముగిసింది.
మహావీర్ జయంతి సందర్భంగా గురువారం బులియన్ మార్కెట్‌కు సెలవులు ఇచ్చారు. ఇక జూన్‌లో డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో రూ.1,703 పెరిగి 10 గ్రాములకు రూ.93,736కి చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా-చైనా మధ్య సుంకాల రగడ మరింత పెరుగుతున్న నేపథ్యంలో బంగారం రికార్డు స్థాయిలో ర్యాలీ కొనసాగుతున్నది. ఎంసీఎక్స్‌లో రూ.93,500 దగ్గర కొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) విశ్లేషకుడు జతిన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3,237.39 డాలర్లకు పెరిగి చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిని తాకింది. ఆ తర్వాత ఔన్సుకు 3,222.04కి పడిపోయింది. ఆసియా మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు రికార్డు స్థాయిలో 3,249.16 డాలర్లకు చేరింది. కోటక్ సెక్యూరిటీస్‌లోని ఏవీపీ కమోడిటీ రీసెర్చ్‌లోని కైనాట్ చైన్వాలా ప్రకారం.. యూఎస్-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా సురక్షిత పెట్టుబడులకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా కామెక్స్ బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఏప్రిల్ 2న బంగారం ధరలు ఔన్సుకు 3,200 డాలర్ల మార్క్‌ని దాటింది. తర్వాత లాభాల బుకింగ్ కారణంగా ధరలు తగ్గాయి. గురువారం, ట్రంప్ పరిపాలన చైనా వస్తువులపై 145 శాతం వరకు సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ప్రతిగా స్పందించిన చైనా 125 శాతం వరకు సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. వాణిజ్యం, ఆర్థిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణ భయాలు, మాంద్యం ముప్పు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక మార్కెట్లలో కొనసాగుతున్న ఆందోళనల సేకరణ బంగారం మరింత పెరుగుతూనే ఉంటుందని యూబీఎస్ పేర్కొంది. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధానికి బంగారం కేంద్రంగా ఉండడం.. దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది. గత మూడు సంవత్సరాలలో కేంద్ర బ్యాంకులు సంవత్సరానికి రికార్డు స్థాయిలో 1,000 మెట్రిక్ టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేయని తెలిపింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ రూ.87,450 ఉండగా.. 24 క్యారెట్స్ పసిడి రూ.95,400 వద్ద కొనసాగుతున్నది. ఇక కిలో వెండి రూ.1,08లక్షలు పలుకుతున్నది.