Gold Rates Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా బలమైన ట్రెండ్ నేపథ్యంలో ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మంగళవారం 24 క్యారెట్ల పసిడి ధర రూ.600 పెరిగి.. తులం ధర రూ.1,00,770కి చేరుకుంది. 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.500 పెరిగి తులం ధర రూ.1,00,400కి చేరుకుంది. మరో వైపు వెండి రూ.3వేలు పెరిగి.. తులం ధర రూ.1,18,000కి పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది.
ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించడం ప్రభావం చూపిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. పెట్టుబడిదారులు సాంప్రదాయ సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు పెరిగాయి. ఈ నిర్ణయం సెంట్రల్ బ్యాంకు స్వతంత్రపై ఆందోళనలు రేకెత్తించింది. అలాగే, ట్రంప్ చర్యలు వడ్డీ రేట్లను త్వరగా తగ్గించడానికి ఫెడ్ నాయకత్వంపై అదనపు ఒత్తిడిని తీసుకువచ్చారు. ఇది బంగారానికి ప్రయోజనం చేకూర్చే చర్యగా సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం 0.37 శాతం పెరిగి ఔన్స్‌కు 3,378.37 డాలర్లకు ఎగిసింది. మరోవైపు, స్పాట్ సిల్వర్ 0.21 శాతం తగ్గి ఔన్స్‌కు 38.48కి చేరుకుంది.
అధ్యక్షుడు ట్రంప్ ఫెడ్ గవర్నర్ లిసా కుక్‌ను తొలగించిన తర్వాత యూఎస్ సెంట్రల్ బ్యాంక్ స్వతంత్రపై ఆందోళనల మధ్య డాలర్ మళ్లీ బలహీనపడడంతో స్పాట్ గోల్డ్ పెరిగిందని కోటక్ సెక్యూరిటీస్‌లోని ఏవీపీ కమోడిటీ రీసెర్చ్ కైనత్ చైన్వాలా తెలిపారు. సుంకాలపై అనిశ్చితి సైతం పెరుగుదలకు కారణమని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. ఆగస్టు 27 నుంచి భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకం విధించాలన్న ట్రంప్ చర్యలు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు శాంతి చర్చలలో ఏదైనా అర్థవంతమైన పురోగతిపై వ్యాపారులను సందిగ్ధంలో పడేస్తున్నాయి. మరో వైపు సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా, టర్కీ, బంగారు నిల్వలను భారీగా కొనుగోళ్లు చేయడంతో మార్కెట్లో ఊపు వస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల పసిడి రూ.93,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,02,060 పలుకుతున్నది. వెండి కిలోకు రూ.1.30లక్షలుగా ఉంది.