Gold Rates | పండుగలు.. పబ్బాలు.. పెండ్లిండ్లు.. శుభకార్యాలకు భారతీయులు బంగారం కొనుగోలు చేయాలని తలపోస్తారు. దీంతోపాటు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఇన్వెస్టర్ల పెట్టుబడులకు స్వర్గధామం బంగారం. భౌగోళిక ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక రంగంలో ఒడిదొడుకులు ఇలాగే కొనసాగడంతోపాటు అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం వంటి కారణాలతో 2025లో దేశీయ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.85 వేల నుంచి రూ.90 వేల వరకూ దూసుకెళ్తుందుని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం దేశ రాజధానిలో స్పాట్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.79,350 వద్ద పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో పది గ్రాముల బంగారం రూ.76,600 వద్ద ట్రేడయింది. 2024 జనవరి ఒకటో తేదీన తులం బంగారం ధర రూ.63,870 పలికింది. నాటి నుంచి ఇప్పటి వరకూ బంగారం ధర 23 శాతం పెరిగింది. అక్టోబర్ 30న తులం బంగారం ధర రూ.82,400లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఏడాది ప్రారంభంలో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం 2062 డాలర్లు పలికితే.. అక్టోబర్ 31న 2790 డాలర్లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. గ్లోబల్ మార్కెట్ ధరల ప్రకారం బంగారంపై 28 శాతం రిటర్న్స్ లభిస్తాయి.
మరోవైపు, జనవరి ఒకటో తేదీన కిలో వెండి ధర రూ.94,700 పలికింది. 2024లో వెండిపై 30 శాతం రిటర్న్స్ లభించాయి. అక్టోబర్ 23న హైదరాబాద్‌లో రూ.1,12,000లకు చేరింది. తిరిగి తగ్గుతూ వచ్చిన వెండి ధర ప్రస్తుతం రూ.98 వేల వద్ద కొనసాగుతున్నది. దేశీయంగా కిలో వెండి ధర రూ.1.1 లక్షల నుంచి రూ.1.25 లక్షల జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది.
నవంబర్ లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హయాంలో పన్నులు, ఆర్థిక విధానాలతోపాటు ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి కుదించాలన్న యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయాన్ని బట్టి బంగారం, వెండి ధరలు ఆధార పడి ఉంటాయి. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొంటే తక్షణం 2-3 శాతం ధరలు పెరుగుతాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత డాలర్, యూఎస్ బాండ్ల విలువ పెరగడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. బేరిష్ ధోరణలు కొనసాగితే దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర (ఎంసీఎక్స్) రూ.73,000–రూ.73,500 మధ్య, అంతర్జాతీయ మార్కెట్లో 2455 డాలర్ల వద్ద తచ్చాడు తుందని భావిస్తున్నారు. మరోవైపు, రూపాయి విలువ పతనమైతే దేశీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయి.
గత జూలైలో కేంద్ర బడ్జెట్లో బంగారం దిగుమతిపై సుంకం ఆరు శాతం తగ్గించిన తర్వాత ధరలు ఏడు శాతం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.5000 తగ్గింది. దీంతోపాటు పండుగలు, పెండ్లిండ్ల సీజన్ లో బంగారానికి డిమాండ్ పెరిగింది. దిగుమతి సుంకం తగ్గింపుతో బంగారం లభ్యం కాగా, కొనుగోళ్లకు గిరాకీ పెరిగింది. జ్యువెల్లరీ ఆభరణాల వినియోగం 17 శాతం పెరిగింది. ఈ ఏడాది బంగారం దిగుమతులు 500 టన్నులు దాటతాయని చెబుతున్నారు.