Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర స్వల్పంగా రూ.100 వృద్ధి చెంది రూ.82,100లకు పెరిగింది. ఆభరణాల తయారీలో వినియోగించే 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.100 వృద్ధితో రూ.81,700లకు చేరుకుంది. సోమవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,000, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.81,600 వద్ద స్థిర పడింది. మంగళవారం కిలో వెండి ధర ఫ్లాట్‌గా రూ.93,000 వద్ద కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.426 వృద్ధితో రూ.78,970లకు చేరుకుంది.
ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది స్పందిస్తూ ‘ఎంసీఎక్స్‌లో తులం బంగారం ధర లాభ పడి రూ.79 వేలకు చేరుకుంది. మెక్సికో, కెనడాల నుంచి దిగుమతులపై సుంకాలు పెంచుతామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఎంసీఎక్స్‌లో బంగారం ధర పెరిగింది’ అని వ్యాఖ్యానించారు. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.188 (0.21 శాతం) పెరిగి రూ.91,630లకు చేరుకుంది.
గ్లోబల్ మార్కెట్లలో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 18.20 డాలర్లు (0.66 శాతం) పెరిగి 2,730.50 అమెరికా డాలర్లకు చేరుకుంది. బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం మంగళవారం ట్రేడింగ్‌లో గతేడాది నవంబర్ ఆరో తేదీన జీవిత కాల గరిష్టాన్ని తాకి ప్రస్తుతం 2,725 డాలర్ల వద్ద నిలిచింది. తాజాగా సుంకాలు పెంచుతామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా ట్రేడ్ వార్‌కు దారి తీస్తుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఈ ఏడాది రెండు సార్లు వడ్డీరేట్లను యూఎస్ ఫెడ్ రిజర్వ్ తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల పెరిగిన యూఎస్ ట్రెజరీ బాండ్ల ధరలతో బులియన్ మార్కెట్ ధరల్లోనూ కరెక్షన్ నమోదవుతుందని తెలుస్తోంది. సిల్వర్ కామెక్స్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 31.10 డాలర్లు పలికింది.
తాజాగా అమెరికాలో ఎటువంటి ఆర్థిక డేటా వెలువడలేదు. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విధానాల నిర్ణయాలపై వ్యాపారులు, ఇన్వెస్టర్లు దృష్టిని కేంద్రీకరించారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ట్రంప్ విధాన నిర్ణయాలను బట్టే బులియన్ మార్కెట్లో ఒడిదొడుకులు నెలకొంటాయని చెప్పారు.