Gold | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. రోజుకొక రికార్డు స్థాయికి చేరిన పుత్తడి సోమవారం రూ.89 వేల దిగువకు పడిపోయింది. అధిక ధరల కారణంగా కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,200 తగ్గి రూ. 88,200కి దిగొచ్చింది. ధరలు తగ్గకముందు ఇది రూ.89,400గా ఉన్నది.
అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర కూడా రూ.1,200 దిగి రూ.89 వేల నుంచి రూ.87,800గా నమోదైంది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.1,200 తగ్గి రూ.87,800గా నమోదైంది. అయినప్పటికీ ఫ్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ నెల డెలివరీకిగాను తులం ధర రూ.431 అధికమై రూ.85,118కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,911.95 డాలర్లు పలుకగా, వెండి 32.89 డాలర్ల వద్ద ఉన్నది.