Gold- Silver Rates | వరుసగా మూడు రోజులు పెరిగిన వెండి ధరలు సోమవారం దిగి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కిలో వెండి ధర రూ.2000 క్షీణించి రూ.92,500 పలికింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.94,500 వద్ద ముగిసింది. మరోవైపు వరుసగా తొమ్మిది సెషన్లలో జీవిత కాల గరిష్టానికి చేరుకున్న బంగారం ధర శుక్రవారం రూ.78,300 వద్ద స్థిర పడింది. సోమవారం కూడా ఫ్లాట్గా కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో అక్టోబర్ డెలివరీ తులం బంగారం ధర రూ.42 వృద్ధితో రూ.74,900 వద్ద ముగిసింది. కిలో వెండి అక్టోబర్ డెలివరీ ధర రూ.586 తగ్గి రూ.90,812 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర గతవారం రికార్డు గరిష్టానికి చేరుకుని 2708.70 డాలర్లు పలికింది. సోమవారం కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర 2669.60 డాలర్లకు దిగి వచ్చింది. ఔన్స్ వెండి ధర కూడా 0.30 శాతం తగ్గి 31.72 డాలర్లకు చేరుకున్నది. ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.