Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లలో జ్యువెల్లర్లు, రిటైలర్లు, స్టాకిస్టుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో మంగళవారం బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కరోజే 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1,100 వృద్ధి చెంది తిరిగి రూ.89 వేల మార్క్‌ను చేరుకుందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. సోమవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.87,900 వద్ద ముగిసింది. మరోవైపు 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1,100 పుంజుకుని రూ.88,600 పలికింది. సోమవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.87,500 వద్ద స్థిర పడింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.1,500 వృద్ధితో రూ.98,000లకు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.96,500 వద్ద ముగిసింది.
కెనడా, మెక్సికో, చైనాలపై విధించిన టారిఫ్‌లు యధాతథంగా అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ధృవీకరించడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయని బులియన్ వ్యాపారులు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలకు ప్రతిగా యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతామని చైనా, కెనడా ప్రకటించడంతో నార్త్ అమెరికా పొడవునా ఉద్రిక్తతల పెరుగుదలకు దారి తీసింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఏప్రిల్ డెలివరీ తులం బంగారం ధర రూ.806 పుంజుకుని రూ.86,190 వద్ద స్థిర పడింది. ‘కామెక్స్ గోల్డ్‌లో బంగారం ధర ఒక శాతానికి పైగా పెరిగి పాజిటివ్‌గా ఉంది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర పెంచుకున్నా.. అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ స్వల్పంగా పతనమైంది. కెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా దిగుమతి సుంకాలు, అమెరికాపై చైనా, కెనడా ప్రతీకార దిగుమతి సుంకాల పెంపునకు దిగాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల మదుపునకు స్వర్గధామంగా నిలిచిన బంగారం ధరకు రెక్కలొచ్చాయి’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. ఇక ఎంసీఎక్స్‌లో కిలో వెండి మే డెలివరీ ధర రూ.472 పుంజుకుని రూ.96,482 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఏప్రిల్ కాంట్రాక్ట్స్ ఔన్స్ బంగారం ధర 32.70 (1.13 శాతం) డాలర్లు పెంచుకుని 2,933.80 డాలర్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే స్పాట్ గోల్డ్ ఔన్స్ బంగారం ధర ఒకశాతం పెరిగి 2,921.42 డాలర్లకు చేరుకుంది.