Gold Prices | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : దేశీయంగా బంగారం ధరలు మళ్లీ ఆల్టైమ్ హైకి చేరుకున్నాయి. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.900 పుంజుకొని రూ.89,400లుగా నమోదైంది. తొలిసారి గత శుక్రవారం (ఫిబ్రవరి 14) ఇదే స్థాయికి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ఒక్కరోజే ఏకంగా రూ.1,200 పడిపోయింది. కానీ మంగళవారం రూ.300 పెరిగిన నేపథ్యంలో మళ్లీ రేటు రికార్డు గరిష్ఠాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి పెరిగిన డిమాండ్, భారతీయ విపణిలో హోల్సేల్, రిటైల్ నగల వ్యాపారుల కొనుగోళ్లు ధరల్ని పరుగులు పెట్టించాయని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇదిలావుంటే హైదరాబాద్లో తులం 24 క్యారెట్ పుత్తడి రేటు రూ.700 ఎగబాకి రూ.87,650గా.. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.650 ఎగిసి రూ.80,350గా ఉన్నది. కాగా, ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా తులం బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.10,010 పెరిగింది. జనవరి 1న రూ.79,390గానే ఉన్నది.