Gold Price | హైదరాబాద్/న్యూఢిల్లీ, నవంబర్ 11: గోల్డ్ మార్కెట్ వెలవెలబోతున్నది. దేశీయ విపణిలో 10 రోజుల కిందటిదాకా ఆల్‌టైమ్ హైలను తాకిన బంగారం ధరలు.. ఇప్పుడు దిద్దుబాటుకు గురవుతున్నాయి. రోజుకింత తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పసిడి రేటు మరో రూ.600 పడిపోయి రూ.79వేల మార్కుకు దిగువన రూ.78,760 వద్ద నిలిచింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత లేదా బంగారు ఆభరణాలు) 10 గ్రాములు రూ.550 దిగజారి రూ.72,200 వద్ద స్థిరపడింది. అయితే ఢిల్లీలో 24 క్యారెట్ తులం విలువ రూ.79,550గా ఉన్నది.
గతంతో పోల్చితే రూ.450 తగ్గింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, దేశీయంగా కానరాని డిమాండ్ వల్లే ధరలు తగ్గుతున్నాయని అఖిల భారత సరఫా అసోసియేషన్ చెప్తున్నది. నిజానికి దీపావళి రోజున ఆల్‌టైమ్ హైని తాకుతూ 24 క్యారెట్ పసిడి ధర తులం రూ.82,400 పలికింది. కానీ ఈ పది రోజు ల్లో రూ.3,000-3,500 మేర దిగొచ్చింది. వెండి ధరలూ నేలచూపుల్నే చూస్తున్నాయి. ఢిల్లీలో కిలో ధర రూ.600 పడిపోయి రూ.94,000కు పరిమితమైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే.. ఔన్సు గోల్డ్ 2,650 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ 31.52 డాలర్లుగా నమోదైంది.
మరింతగా తగ్గుముఖం: ఫెడ్ రిజర్వ్
బంగారం, వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింతగా తగ్గుముఖం పట్టవచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తున్నది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం, వెండి నుంచి తిరిగి ఈక్విటీలు, బాండ్ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారని, అందుకే గోల్డ్, సిల్వర్ మార్కెట్లలో ఈ కరెక్షన్ ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు. దీంతో మున్ముందు ధరల్లో మరింత దిద్దుబాటుకు అవకాశాలూ లేకపోలేదని వారు చెప్తున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు.