Gold Price | న్యూఢిల్లీ, నవంబర్ 22: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నది. ఆభరణాల వర్తకులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతోపాటు పెండ్లిళ్ల సీజన్ కూడా కావడంతో రిటైలర్లు కూడా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా భారీగా పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పుత్తడి ధర మళ్లీ రూ.80 వేల మార్క్‌ను అధిగమించింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం ధర మరో రూ.1,100 అందుకొని రూ.80,400కి చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
గురువారం బంగారం ధర రూ.79, 300గా ఉన్నది. వరుసగా రెండు రోజుల్లో బంగారం ధర రూ.2,500 పెరిగినట్లు అయింది. బంగారంతోపాటు వెండి ధరలు పుంజుకున్నాయి. కిలో వెండి ధర రూ.300 అధికమై రూ.93,300 పలికింది. ఇటు హైదరాబాద్‌లోనూ 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ తులం గోల్డ్ ధర రూ.870 అధికమై రూ.78,820కి చేరుకున్నది. అలాగే 22 క్యారెట్ ధర రూ.800 ఎగబాకి రూ.72,250 పలికింది. కిలో వెండి రూ.1.01 లక్షల వద్ద స్థిరంగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,695 డాలర్లు, వెండి 31.19 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.