న్యూఢిల్లీ, నవంబర్ 14 : బంగారం ధరలు కొండదిగాయి. గడిచిన నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి ధరలు శుక్రవారం దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ఆర్థిక గణాంకాలు నిరాశాజనకంగా ఉండటంతో వడ్డీరేట్ల కోత మరింత ఆలస్యంకావచ్చని ఫెడరల్ రిజర్వు ఉన్నతాధికారి వ్యాఖ్యలతో మదురుల్లో ఉత్సాహాం ఆవిరైపోయింది. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,500 దిగొచ్చి రూ.1, 29,400 వద్ద ముగిసింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా అంతే స్థాయిలో తగ్గి రూ.1,28,800కి దిగొచ్చింది.
ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల కోతపై అనిశ్చితి నెలకొనడం వల్లనే గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ విశ్లేషకులు సౌమిల్ గాంధీ తెలిపారు. షట్డౌన్ కారణంగా అమెరికా ఆర్థిక గణాంకాలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలుండటం ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు. బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ఏకంగా రూ.4,200 దిగొచ్చి రూ.1,64, 800గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 33.58 డాలర్లు తగ్గి 4,100 డాలర్లుగా నమోదవగా, వెండి 51 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.