Gold Rate | న్యూఢిల్లీ, మార్చి 28: బంగారం ధరలు భగభగమండుతున్నాయి. ఇప్పటికే సామాన్యుడికి అందని స్థాయికి చేరుకున్న పుత్తడి విలువ మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర రూ.92 వేల మైలురాయిని అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై సుంకాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో వీటి ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకాయి. ఇదే క్రమంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర శుక్రవారం ఒకేరోజు రూ.1,100 ఎగబాకి రూ.92,150 పలికింది.
ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. గురువారం ఈ ధర రూ.91,050గా ఉన్నది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.1,100 అధికమై చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.91,700కి చేరుకున్నది. ఇటు హైదరాబాద్‌లోనూ గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.1,140 ఎగబాకి రూ.90,980కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.1,050 అధికమై రూ.83,400 పలికింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం ధర రూ.23,730 లేదా 35 శాతం ఎగబాకింది. గతేడాది ఏప్రిల్ 1న తులం ధర రూ.68,420గా ఉన్నది.
పుత్తడి బాటలోనే వెండి
వెండి ధరలు భారీగా పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.1,300 అందుకొని రూ. 1,03,000కి చేరుకున్నది. అంతర్జాతీయ దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు నెలకొనడం, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన చిక్కులు ఎదురుకావడం బంగారం ధరలు రివ్వున ఎగరడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు.