Gold Rate | ఇటీవల బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో రోజురోజుకు సరికొత్త గరిష్టాలను చేరాయి. తాజాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ప్రకటనకు ముందు బంగారం ధరలు ఆల్‌టైమ్ హై నుంచి పతనమయ్యాయి. బుధవారం ఢిల్లీలో ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.1300 తగ్గి.. తులం ధర రూ.1,13,800కి తగ్గిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.1300 తగ్గి తులం ధర రూ.1,13,300కి తగ్గింది.
అమెరికా సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ ఎంపీసీ సమావేశమైంది. సమావేశం ఫెడ్ పాలసీ నిర్ణయం ప్రకటించే ముందు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం వెలువడక ముందు రిస్క్ తీసుకునేందుకు పెట్టుబడిదారులు వెనుకాడినట్లుగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేకుండా ఏదైనా తటస్థ వైఖరితో బులియన్ మార్కెట్లో కొంతశాతం పాయింట్లు తగ్గుదలకు దారి తీసే అవకాశం ఉందని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. అదే సమయంలో వెండి ధరలు సైతం భారీగానే తగ్గాయి.
బుధవారం వెండి రూ.1,670 తగ్గి.. కిలోకు రూ.1,31,200కి పడిపోయింది. గత సెషన్లో రూ.570 పెరిగి కిలోకు రూ.1,32,870 చేరి సరికొత్త రికార్డు గరిష్టాన్ని తాగిన విషయం తెలిసిందే. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటనకు ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు దాదాపు 1 శాతం తగ్గి 3,664.82 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా బుధవారం దాదాపు మూడు శాతం తగ్గి ఔన్సుకు 41.38కి డాలర్లకు చేరింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,11,710 ఉండగా , 22 క్యారెట్ల పసిడి రూ.1,02,400 పలుకుతున్నది. కిలో వెండి రూ.1.42లక్షల వద్ద ట్రేడవుతున్నది.