Gold Rates | కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం తీసుకోవడం, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు తమ పెట్టుబడులకు స్వర్గధామంగా బంగారాన్ని పరిగణిస్తున్నారు. ఫలితంగా పుత్తడి ధర మెరుపులు మెరిపిస్తూ కొత్త రికార్డుల పుంతలు తొక్కుతోంది. సోమవారం దేశీయ బులియన్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.250 వృద్ధితో రూ.78,700 లకు చేరుకుంది. దీంతో జీవిత కాల గరిష్టానికి బంగారం ధర చేరుకున్నది. దేశీయంగా జ్యువెల్లరీ వ్యాపారులు, కస్టమర్ల నుంచి గిరాకీ పెరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధర పెరుగుతోంది. శుక్రవారం తులం బంగారం ధర రూ.78,450 వద్ద ముగిసింది. ఇదిలా ఉంటే, శుక్రవారం ధరతో పోలిస్తే కిలో వెండి ధర సోమవారం రూ.200 తగ్గి రూ.94 వేల వద్ద స్థిర పడింది.
ఇక సోమవారం దేశీయ బులియన్ మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.200 పుంజుకుని రూ.78,300 వద్ద నిలిచింది. శుక్రవారం రూ.78,100 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఏషియన్ మార్కెట్లలో కామెక్స్ గోల్డ్‌లో ఔన్స్ బంగారం ధర 0.14 శాతం వృద్ధితో 2671.50 డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ధర 0.61 శాతం పతనమై 32.20 డాలర్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉంటే, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును ప్రోత్సహించేందుకు యూఎస్ ఫెడ్ రిజర్వ్ వచ్చే నెలలో మరో 50 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తు్న్నారు.