Gold Rates | న్యూఢిల్లీ, డిసెంబర్ 31: బంగారం ధరలు కొత్త ఏడాదిలోనూ రికార్డుల మోత మోగించడం ఖాయమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో తులం 24 క్యారెట్ పసిడి రేటు 2025లో రూ.85,000 స్థాయికి వెళ్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే ఏకంగా రూ.90,000 మార్కును తాకవచ్చనీ చెప్తుండటం గమనార్హం. నిజానికి 2024లోనూ గోల్డ్ రేట్లు బాగానే పరుగులు పెట్టాయి. అక్టోబర్ 30న ఆల్‌టైమ్ హైని చేరుతూ 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి విలువ రూ.82,400 పలికింది.
అయితే ఆ తర్వాత క్రమేణా రేట్లు పడిపోయాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో తులం రూ.79,350గా ఉన్నది. ఇక మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో రూ.76,600గా నమోదైంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం స్పాట్ మార్కెట్లో ధరలు తిరిగి విజృంభించే అవకాశాలే ఉన్నట్టు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ప్రథమార్ధం (జనవరి-జూన్)లో మార్కెట్ ఒడిదొడుకులకు గురైనా.. ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్)లో మాత్రం ఎంసీఎక్స్‌లో రూ.73,000-73,500 శ్రేణిలో ట్రేడ్ కావచ్చని, అంతర్జాతీయంగా ఔన్స్ 2,455 డాలర్లు పలుకవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు పెరగడం కూడా భారతీయ మార్కెట్లో రేట్లను పరుగులు పెట్టిస్తున్నాయి. 2024లో కొమెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ ధర 2,062 డాలర్లుగా మొదలైంది. అక్టోబర్‌లో అది గరిష్ఠంగా 2,801.8 డాలర్లకు చేరింది. దీంతో ఇన్వెస్టర్లకు 28 శాతం వరకు రిటర్న్స్ వచ్చినైట్టెంది. ఈ క్రమంలో 2025లోనూ గోల్డ్‌పై మదుపు చేసేవారికి భారీ లాభాలే వస్తాయని ట్రేడింగ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఔన్స్ 3,200 డాలర్లకు వెళ్లవచ్చని అంటుండటం విశేషం. దీంతో ఎంసీఎక్స్‌లో 10 గ్రాములు రూ.87,000లుగా ఉంటుందన్న అంచనాలున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ పరస్పర దాడులతో వేడెక్కిన పశ్చిమాసియా పరిస్థితులు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి కొనుగోళ్లకు పెద్దపీట వేయడం, వడ్డీరేట్లను తగ్గించడం వంటివి బంగారానికి మరింత డిమాండ్ తెచ్చిపెట్టే వీలుందని వారు అభిప్రాయపడుతున్నారు. గడిచిన రెండు సంవత్సరాల్లో ఏటా 1,000 టన్నులకుపైగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొన్నాయని గుర్తుచేస్తున్నారు.
బంగారంతోపాటు వెండి ధరలూ కొత్త ఏడాది ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందులోభాగంగానే దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1.10 లక్షలకు వెళ్లవచ్చని, అంతర్జాతీయంగా ఉద్రిక్తకర వాతావరణం కొనసాగితే ఏకంగా రూ.1.25 లక్షలు సైతం పలుకవచ్చని పేర్కొంటున్నారు. 2024లో రూ.1,02,000 ల ధరతో దేశీయంగా సిల్వర్ ఆల్‌టైమ్ హై రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తే, కరెన్సీ మార్కెట్లో డాలర్ బలహీనపడితే, గోల్డ్-సిల్వర్ మార్కెట్‌కు భారీ ఉత్సాహమేనని వివరిస్తున్నారు.