న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు ధరలు భారీగా పుంజుకోవడం, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమవడం వల్లనే దేశీయంగా పుత్తడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.440 పెరిగి రూ.50,900 పలికింది. పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు పెరగడంతో కిలో వెండి ఏకంగా రూ.910 అధికమై రూ.61,770 పలికింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,852 డాలర్లు పలుకగా, వెండి 22 డాలర్ల వద్ద ఉన్నది.