న్యూఢిల్లీ, జనవరి 21: బంగారం ధరలు భగభగ మండుతున్నాయి. రోజుకొక రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న ధరలు బుధవారం మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో వీటి ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1.60 లక్షలకు చేరుకున్నది. నిన్నటితో పోలిస్తే పదిగ్రాముల ధర రూ.6,500 లేదా 4.24 శాతం ఎగబాకింది.
ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ రూ.9 వేలు పుంజుకొని రూ.1.56 లక్షలు పలికింది. మరోవైపు, వెండి రికార్డుస్థాయికి చేరుకున్నది. అంతర్జాతీయంగా మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన వెండి వైపు మళ్లించడంతో కిలో వెండి ఏకంగా రూ.11,300 ఎగబాకి రూ.3.34 లక్షలు పలికింది.