న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: స్పాట్ మార్కెట్లో పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. రోజుకో రికార్డును సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం మరో ఆల్టైమ్ హైని గోల్డ్ రేట్లు చేరుకున్నాయి. హైదరాబాద్లో ఏకంగా 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) కలిగిన 10 గ్రాముల పసిడి విలువ మునుపెన్నడూ లేనివిధంగా రూ.70,470గా నమోదైంది. బుధవారం తులం రూ.760 ఎగిసి తొలిసారి రూ.70,000 మార్కును దాటిన విషయం తెలిసిందే. 22 క్యారెట్ కూడా అంతకుముందు రోజుతో పోల్చితే రూ.500 పెరిగి రూ.64,100 నుంచి రూ.64,600లకు చేరింది. ఇక గత నెల 29న ఏకంగా 10 గ్రాముల పుత్తడి రేటు రూ.1,420 ఎగబాకడం గమనార్హం. 22 క్యారెట్ రేటూ రూ.1,300 ఎక్కింది. ఈ నెల 1న కూడా రూ.930, రూ.850 చొప్పున పుంజుకున్నాయి. ఇదిలావుంటే ఢిల్లీలో గురువారం రూ.850 పెరిగి రూ.70,050 వద్ద 24 క్యారెట్ గోల్డ్ ధర స్థిరపడింది. పెండ్లిళ్ల సీజన్ కావడం, అంతర్జాతీయ మార్కెట్ నుంచి అనుకూల సంకేతాలు వస్తుండటంతో దేశీయ మార్కెట్లో ధరలు రోజుకింత పెరుగుతూపోతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వెండి ధరలూ..
బంగారం ధరలతోపాటు వెండి రేట్లూ దౌడు తీస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో ధర రూ.82,000లుగా ఉన్నది. ఒక్కరోజే రూ.1,000 ఎగిసింది. బుధవారం రూ.2,000 ఎగబాకింది. సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమల నుంచి కూడా డిమాండ్ ఉండటంతో రేట్లు పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లోనూ ఔన్సు 27.05 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. కొమెక్స్లో గోల్డ్ ఔన్సు 2,297 డాలర్లు పలికింది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.1,000 అందిపుచ్చుకుని రూ.81,700లకు చేరింది.
ఇంకా ధరలు పైపైకే
దేశ, విదేశీ మార్కెట్లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులనుబట్టి బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే వీలున్నదన్న అంచనాలే వ్యక్తమవుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా కరెన్సీ అయిన డాలర్ బలహీనపడుతుండటం, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతలపై అనిశ్చితి కొనసాగుతుండటం గోల్డ్ రేట్లను ఎగదోస్తున్నదని మెజారిటీ విశ్లేషకులు చెప్తున్నారు. దీనికితోడు స్పాట్ మార్కెట్లో కస్టమర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్ కూడా రేట్లను కొత్త రికార్డుల వైపునకు తీసుకెళ్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు.
గడిచిన 76 ఏండ్లలో బంగారం ధరలు (రూ.లలో)