న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఈక్విటీ మార్కెట్లతోపాటు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఆభరణాల వర్తకులు, స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో పుత్తడి ధర ఒకేరోజు రూ.1,500కి పైగా పడిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.91,450కి పరిమితమైనట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. గతవారంలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం ధర రూ.93 వేల స్థాయిలో ఉండగా, ప్రస్తుతం రూ.92 వేల దిగువకు పడిపోయింది.
ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడంతో మరోసారి ఆర్థిక మాంద్యం గుప్పిట్లోకి ప్రపంచ దేశాలు వెళ్లే అవకాశం ఉన్నదన్న ఆందోళనలు మదుపరులో నెలకొన్నాయని, ఫలితంగా విక్రయాలకు మొగ్గుచూపడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ ఉన్నతాధికారి సౌమిల్ గాంధీ తెలిపారు. పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతిన్నదని, వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా స్పష్టతనిచ్చే అవకాశం కోసం మదుపరులు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారని చెప్పారు. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం ధర రూ.280 దిగి రూ.90,380గా నమోదైంది.
వరుసగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు సోమవారం కూడా భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్లాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో కిలో వెండి రూ.3,000 దిగొచ్చి రూ.92,500కి పరిమితమైంది. గత ఐదు సెషన్లలో వెండి రూ.10,500 తగ్గినట్టు అయింది. ఇటు హైదరాబాద్లో కిలోవెండి రూ.1.03 లక్షలుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 10.16 డాలర్లు తగ్గి 3,027.20 డాలర్లకు పరిమితమవగా, వెండి 30.04 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.