న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశీయంగా అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధర రూ.1.60 లక్షల స్థాయికి పడిపోయింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.1,60,250కి దిగింది. అంతకుముందు ఈ ధర రూ.1.61 లక్షలుగా ఉన్నది. బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, వెండి మాత్రం యథాతథంగా నమోదైంది. వరుసగా రెండోరోజూ సోమవారం కూడా కిలో వెండి రూ.2,40,500గా ఉన్నట్టు ప్రాంతీయ ట్రేడర్లు వెల్లడించారు.
అమెరికా ఉద్యోగ అవకాశాల గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో ఈ నెలలో ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచే అవకాశాలుండటంతో గోల్డ్ ధరలు ఒత్తిడికి లోనయ్యాయని లెమనాన్ బ్రోకరేజ్ చీఫ్ గౌరవ్ గార్గ్ తెలిపారు. ఈవారంలో యూఎస్ ధరల సూచీ కూడా విడుదలకానున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 35.03 డాలర్లు లేదా ఒక్క శాతం తగ్గి 4,400 డాలర్ల దిగువకు 4,395.30 డాలర్లకు పడిపోయింది. అలాగే వెండి కూడా ఒక్క శాతం తగ్గి 65.64 వద్ద స్థిరపడింది.