న్యూఢిల్లీ, మే 4: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడికి డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2 వేలు లేదా 1.3 శాతం తగ్గి రూ.1,52,800కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1, 54,800గా ఉన్నది. మరోవైపు, వెండి ధరలు భారీగా పెరిగాయి.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.6,800 ఎగబాకి రూ.2.49 లక్షలకు చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య అనిశ్చితి కొనసాగుతుండటం, క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 49.27 డాలర్లు తగ్గి 4,565.68 డాలర్లకు పడిపోగా, వెండి 73.43 డాలర్ల దిగువకు తగ్గాయి.