న్యూఢిల్లీ, ఆగస్టు 25: బంగా రం ధరలు మళ్లీ విజృంభిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో వరుసగా రేట్ల పెరుగుదల కనిపిస్తున్నది. నిజానికి ఈ ఏడాది జనవరి ఆఖర్లో ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయికి చేరిన పసిడి విలువ.. ఆ తర్వాత రోజుల్లో క్రమేణా తగ్గుతూ వచ్చింది. అయితే మే ద్వితీయార్ధం నుంచి తిరిగి పుంజుకుంటున్నది. ఈ క్రమంలోనే అప్పట్నుంచి చూస్తే.. ప్రస్తుతం గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్నది. కానీ ఈ ర్యాలీ మున్ముందు మందగిస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయిప్పుడు.
అమెరికాపైనే ఆధారం..
అమెరికా ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతున్నాయన్న ఆందోళనలు, దీర్ఘకాలిక రుణ వ్యయాలను అదుపులో పెట్టడానికి బాండ్ మార్కెట్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం పెరుగవచ్చన్న అంచనాలు.. మార్కెట్లో పుత్తడి ధరలను మళ్లీ పరుగులు పెట్టిస్తున్నాయిప్పుడు. మంగళవారం గ్లోబల్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,668 డాలర్లపైనే ముగియగా, అమెరికా ఫ్యూచర్స్‌లో 4,700 డాలర్లను దాటింది. ఈ క్రమంలో డాలర్-డీబేస్మెంట్ ట్రేడ్ దిశగా మదుపర్లు వెళ్తున్నారు. గత వారం దీర్ఘకాల బాండ్లను తిరిగి కొనుగోలు చేయడానికి అమెరికా ముందుకు రావడం ఇన్వెస్టర్లలో ఆందోళనల్ని మరింత పెంచింది. ఆ తర్వాత డాలర్ విషయంలోనూ సర్కార్ జోక్యం ఉండవచ్చన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రభుత్వం లేదా కరెన్సీ రిస్క్ లేని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లే ఉత్తమం అన్న భావనకు మెజారిటీ మదుపర్లు వచ్చేస్తున్నారని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందువల్లే ఇటీవలికాలంలో రోజూ బంగారం ధరలు పెరుగుతూపోతున్నాయని వారంతా విశ్లేషిస్తున్నారు.
ఆప్షన్స్ మార్కెట్లో ట్విస్ట్
స్పాట్ మార్కెట్లో గోల్డ్ రన్‌కు బ్రేకులు వేసేలా ఆప్షన్స్ మార్కెట్లో సోమవారం ఓ ట్విస్ట్ చోటుచేసుకున్నది. ఇదే ఇప్పుడు రాబోయే రోజుల్లో పసిడి ధరలు తగ్గబోతున్నాయా? అన్న అనుమానాలను, అంచనాలను రేకెత్తిస్తున్నది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం.. అమెరికా మార్కెట్లు మొదలైన 20 నిమిషాల తర్వాత ఓ మదుపరి ఆప్షన్స్ మార్కెట్లో భారీ అమ్మకాలకు తెరతీశారు. ఎస్పీడీఆర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్‌ల్లో ఏకంగా దాదాపు 1,16,000 కాంట్రాక్టులను ట్రేడర్ అమ్మేయడం గమనార్హం. ఇవన్నీ సెప్టెంబర్ 18 420 డాలర్ కాల్స్. ఇక ఈ అమ్మకాలపై సదరు మదుపరికి సుమారు 202 మిలియన్ డాలర్లు వచ్చాయి.
అయితే మళ్లీ 430 డాలర్ కాల్స్‌ను సుమారు 144 మిలియన్ డాలర్లతో ఆ మదుపరి అన్నే కాంట్రాక్టులను కొన్నారు. దీంతో ఈ షార్ట్-టర్మ్ ర్యాలీలో 58 మిలియన్ డాలర్ల లాభం వచ్చింది. ఈ పరిణామం మార్కెట్లో బేరిష్ ట్రెండ్‌కు సంకేతాలిస్తున్నది. సెప్టెంబర్ ద్వితీయార్ధంలో గోల్డ్ ర్యాలీ చల్లబడుతుందన్న అంచనాలను పెంచుతున్నదని ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. అంతేగాక రాబోయే రోజుల్లో మరిన్ని అమ్మకాలుంటే ధరల పతనం తప్పదనే చెప్తున్నారు. ఇక పశ్చిమాసియాలో సంక్షోభం, పెరుగుతున్న ముడి చమురు ధరలు సైతం గోల్డ్ రేట్లకు కళ్లెం వేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరిగే క్రూడాయిల్ ధరలు డాలర్లకు డిమాండ్ తెచ్చిపెడుతుందని, ఆ మధ్య పసిడి ధరల క్షీణతకు ఇదే కారణమని వారు గుర్తుచేస్తున్నారు.
రూ.2,700 పెరిగిన తులం ధర
బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటు మంగళవారం మరింత పైకి ఎగిసింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పదిగ్రాముల ధర రూ.2,700 ఎగబాకి రూ.1,67,100 పలికింది. ధరలు పెరుగడం వరుసగా ఇది నాలుగోరోజు కావడం విశేషం. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్స్ గోల్డ్ ధర 11.87 డాలర్లు తగ్గి 4,639.51 డాలర్లకు పడిపోగా, వెండి 67.88 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.