న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: బంగారం ధరలు మళ్లీ పరుగెత్తుతున్నాయి. ఫెడ్ వడ్డీరేట్లను అర శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఒక్కసారిగా అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకుంటున్నాయి. ఢిల్లీలో తులం బంగారం ధర రూ.700 అధికమై రూ.76,350 పలికింది. కానీ వెండి రూ.91 వేల వద్ద స్థిరంగా ఉన్నది. బంగారం ధరలు పెరగడం వరుసగా ఇది మూడోరోజని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.660 ఎగబాకి రూ.75,110కి చేరుకున్నది. 22 క్యారెట్ ధర రూ.600 అధికమై రూ.68,850 పలికింది. మరోవైపు, వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి ధర ఏకంగా రూ.1,500 అధికమై రూ.97,500కి చేరుకున్నది.