న్యూఢిల్లీ, నవంబర్ 15: బంగారం కొండదిగుతున్నది. రికార్డుల మీద రికార్డుల బద్దలు కొట్టిన పుత్తడి గడిచిన పక్షం రోజుల్లో భారీగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు అమెరికా షట్డౌన్ ముగియడం, ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని ఫెడరల్ రిజర్వు సంకేతాలివ్వడంతో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం శనివారం ఒకేరోజు రూ.5000 తగ్గి రూ.1,21,895కి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర శుక్రవారం ఒకేరోజు 127 డాలర్లు పడిపోవడం కూడా గోల్డ్ ధర తగ్గడానికి ప్రధాన కారణమని బులియన్ వర్తకులు పేర్కొన్నారు.
బంగారంతోపాటు వెండి ధరలు దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.8,700 తగ్గి రూ.1,53,720కి తగ్గింది. కోమెక్స్ మార్కెట్లో ఔన్స్ వెండి 5.56 శాతం తగ్గి 50.21 డాలర్లకు పడిపోవడం కూడా మరో కారణం.
ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన బంగారం భవిష్యత్తులో డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండనున్నదని విశ్లేషకులు అంటున్నారు. స్వల్పకాలంపాటు బంగారం ధరలు దిద్దుబాటుకు గురికావచ్చుని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దేశీయంగా పండుగ సీజన్ కూడా ముగియడం, ఇప్పట్లో పెళ్లిళ్లు కూడా లేకపోవడంతో డిమాండ్ గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు.