Gold Price | బంగారం అంటే భారతీయులకు.. అందునా మహిళలకు ఎంతో ఇష్టం.. అలాగే పుత్తడి పెట్టుబడి మార్గం కూడా. ఒకవేళ బంగారం కొనుగోలు చేయాలన్నా.. పెట్టుబడి పెట్టాలన్నా ఇదే సరైన తరుణం అని భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించాలని బులియన్ నిపుణులు సూచిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ నెల 8న రూ. 53,890 పలికిన తులం ( Gold Price ) బంగారం (24 క్యారట్లు) బుధవారం ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ ఫ్యూచర్ ధర రూ.51, 386 పలికింది. అంటే వారంలో రూ.2500 తగ్గిందన్న మాట.
మంగళవారం బులియన్ మార్కెట్ ధరతో పోలిస్తే బంగారం ధర రూ.178, సోమవారంతో పోలిస్తే 15న రూ.511 నష్టపోయింది. న్యూయార్క్‌లో ఔన్స్ 24 క్యారట్ల బంగారం ధర 1919.50 డాలర్లకు దిగి వచ్చింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒకానొక దశలో ఔన్స్ బంగారం ధర 1915 డాలర్లకు కూడా పడిపోయింది. ఈ నెల 8న 2069 డాలర్లకూ దూసుకు పోయింది.
త్వరలో కీలక వడ్డీరేట్లు పెంచనున్నట్లు అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తున్నారు. గత మూడేండ్లలో అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తొలిసారి పెంచనున్నట్లు సంకేతాలివ్వడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు.
బంగారంపై పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారని షేర్ ఇండియా రీసెర్చ్ హెడ్ అండ్ వైస్‌ప్రెసిడెంట్ డాక్టర్ రవి సింగ్ చెప్పారు. ఉక్రెయిన్, రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు సానుకూలంగా ఉంటాయన్న సంకేతాలు కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టడానికి కారణాలని అన్నారు.